ఉత్కంఠ రేపుతోన్న కేసీఆర్ కేబినెట్ కహానీ!

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: కేసీఆర్ కేబినెట్ కూర్పు పై ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉత్కంఠ నెలకొంది. అయ్యగారు ఎవరికి బెర్త్ లు ఖరారు చేస్తారు... ఎవరికి ఎర్త్ పెడతారన్నది అంతు చిక్కక గులాబీ నేతలు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. మొత్తం కేబినెట్ ఇప్పుడు చేస్తారా లేక సగం చేసి మిగతాది పార్లమెంట్ ఎన్నికల తర్వాతకు పెండింగ్ పెట్టుకుంటారా అన్నది కూడా అర్థం కావడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం కేసీఆర్ కేబినెట్ విస్తరణలో ఎనిమిది మందికి చోటుంటుందన్న వాదన వినిపిస్తోంది. మలి విడత విస్తరణలో పూర్తి స్థాయిలో 17 మందితో కేబినెట్ ఏర్పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ తో పాటు హోం మంత్రి మహమూద్ అలీ మాత్రమే కేబినెట్ లో ఉన్నారు. మిగతా ఎనిమిది మందిని ఈ నెలాఖరు లోపు కేబినెట్ లోకి తీసుకుని పది మందితో పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు నడిపించేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో విస్తృత ప్రచారం ఉంది.

అయితే, ఈ పది బెర్తుల్లో తమకు ఛాన్స్ ఉంటుందా లేదా అన్నదానిపై ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి కేబినెట్ లో ఓడిపోయిన మంత్రులకు ఛాన్స్ డౌటే అంటున్నారు. అదే జరిగితే కేసీఆర్ సన్నిహితుడు తుమ్మల నాగేశ్వరరావుకు బెర్త్ లేనట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా నుంచే అవకాశం కల్పించాలనుకుంటే ఆ జిల్లా నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కు లక్కీ ఛాన్స్ దక్కవచ్చు. జిల్లా పట్టింపు ఏమీ లేదు... సామాజిక వర్గం నుంచి ఇచ్చే ఛాన్స్ ఉంటే అరికెపూడి గాంధీకు ఛాన్స్ దక్కవచ్చు. ఇక ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కేసీఆర్ తర్వాత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కు ఈ సారి బెర్త్ ఖాయం అంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన జూపల్లి కృష్ణారావు స్థానంలో ఎర్రబెల్లికి ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఇక ఈ సారి కొప్పుల ఈశ్వర్ కు కూడా ఛాన్స్ ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది. మిషన్ భగీరథ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డికి ఈ సారి కేబినెట్ లో స్థానం ఉంటుందంటున్నారు. ఆయనకు ఇరిగేషన్ శాఖ కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. ఇక వీరు కాక ఇంకా ఎవరెవరికి అవకాశం ఉంటుందన్నది ఇంకా క్లారిటీ లేదు.

Related Articles