గిదేంది సారూ...అల్లుణ్ని ఇంట్లజేసినవ్!?

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: ఎలక్షన్స్ అయినయో లేదో టీఆర్ఎస్ ల హరీష్ పరిస్థితి జూస్తే జాలేస్తాంది. ఆయన సిద్ధిపేట దాటి ఈవలికి రావట్లేదు. గింత కాలం పార్టీల సర్వం తానై నడిపించిండు. ఇప్పుడేమో కరివేపాకు లెక్క... పక్కనపెట్టబడితిరి. రాష్ట్ర మొత్తానికి నాయకుడులెక్క వెలిగిన హరీష్ ఇప్పుడు సిద్ధిపేట వాస్తవ్యుడి మాదరి ఊరు దాటడం లేదు. ఇగ కథ అంతటితో ఐపోలేదు... ఈ పనిమంతుని సిద్ధిపేటల ఫిక్స్ చేసి... ఇక్కడ తండ్రి కొడుకులు చక్రం తిప్పబడితిరి. ఒకాయన పార్టీ మొత్తాన్ని చేతిలోకి తీసుకుంటాండు. ఇంకో ఆయన సర్కారు మొత్తం ఒంటిచేత్తో ఏలేస్తాండు. మోతుబరి లీడర్లు గూడా కేటీఆర్ ముంగర క్యూ కట్టబడితిరి. మంత్రి పదవి ఇప్పియవ్వ సారూ... అంటూ దంణ్ణాలు పెట్టబడితిరి. పార్టీ ఆఫీసుకు చిన్నసారు వస్తే జాలు ఈగలెక్క ముసరబడితిరి.

ఇక కాళేశ్వరం పోయివస్తనన్న పెద్దసారు... ఒక్కడే పోయిండు తప్ప, ఎంబడి అల్లుడ్ణి తోల్కొని పోలేదు. నిన్నమొన్నటి వరకు ఇరిగేషన్ మంత్రిగా ఆయనేగా ఉన్నది. ఏం ఎంబడి తోల్కపోతానికి అంత అడ్డమేందో అర్థం కాకపాయె. హరీష్ కు ఇది శానా అవమానమనె జెప్పాల. మాజీ ఇరిగేషన్ మంత్రైతే ఏంది... వెంట తోల్కపోవాల్ననని రూల్ ఏమైనా ఉందా అంటే అట్లెందుకుంటది. కాకపోతే... శాఖ చూసిన మంత్రి, మంచి చెడు తెల్సినోడు కదా! ఎందుకు తోల్కపోలేదు అన్నది మంది డౌటు. ఇగ డౌటేందిలే పెద్దసారు ఏం జేసిన లెక్కైతే ఉంటది గదా!? గిదీ అట్లాందిదే అనుకోవాలె. అల్లుడు హరీష్ ఇరిగేషన్ను దున్నేసిండని ఎలక్షన్ ప్రచారంలో డబ్బగొట్టి చెప్పిండు పెద్ద సారు... ఇప్పుడేమో పనులేంది గింత నత్తనడక నడుస్తున్నా అనవట్టిండు.

మళ్లొచ్చే పాలికి మొత్తం కంప్లీట్ గావాలే అంటూ అధికారుల పై మిరియాలు నూరుతుండు. అంటే... గింత కాలం అల్లుడు హరీష్ అంత పెర్ఫామెన్స్ జూపలేదని మామ భావిస్తున్నాడనుకోవాలే... లేక ఏర్పాటయ్యే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో హరీష్ హస్తం ఏం లేదు... అంతా కేసీఆర్ సారు రంగంలోకి దిగినంకనే పరుగులు పెట్టినయ్ అని చెప్పుకునేందుకే ఈ తిట్లపురాణం, అధికారులకు అక్షింతల బాగోతం అని మంది అనుకుంటుండ్రు!

Related Articles