రాఫెల్...స్కాం వార్!!

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: రఫేల్ ఓ యుద్ధ విమానం. ఇప్పుడు ఇది దేశాన్ని కుదిపేస్తోంది. నిన్నటి వరకు కాంగ్రెస్ చేతిలో ఇదొక బ్రహ్మాస్త్రం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని టార్గెట్ చేసే రాజకీయ ఆయుధం. కానీ, సుప్రీం తాజా తీర్పుతో ప్రస్తుతానికి ఎన్డీయేకు ఊరట లభించింది. ఐనా, అనుమానం ఇంకా మిగిలే ఉంది. వచ్చే ఎన్నికలలో విపక్షాల చేతిలో రఫేల్ ఓ అస్త్రమే. ఇంతకీ ఏమిటీ రఫేల్? ఇందులో వివాదం ఏమిటి? ఇదొక ఆధారాలు లేని కుంభకోణమా? కోర్టు పరిధిలో లేని... రాలేని స్కామా? దివాళ అంచుల్లో ఉన్న అనీల్ అంబానీకి ఊపిరి పోసిన మోడీ నిర్ణయమా? దేశ భద్రతకు సంబంధించిన అంశంలో ఓ ప్రైవేటు భాగస్వామ్యం ఉండటం కరెక్టేనా? హిదుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ కు లేని సామర్థ్యం రిలయన్స్ డిఫెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు ఎలా వచ్చింది? ఈ దేశంలో ప్రభుత్వం కంటే ప్రైవేటు సంస్థలు, వ్యవస్థలే శక్తిమంతమైనవా? ఇవీ ఇప్పుడు విపక్ష పార్టీలు సంధిస్తోన్న ప్రశ్నలు. భారతదేశ సగటు పౌరుడి సందేహాలు. ఇలాంటి ప్రశ్నలకు కోర్టు హాలులో సమాధానాలు దొరకవు.

ఇటీవల కుంభకోణాలు కొత్త మార్గాలలో జరుగుతున్నాయి. వీటికి ఆధారాలు దొరకడం కష్టం. చాలా వ్యవహారాలు పొలిటికల్ లాబీయింగ్ తో జరిగిపోతుంటాయి. గతంలోనూ ఈ వ్యవహారం ఉన్నా అవన్నీ ప్రభుత్వ సంస్థల మధ్య జరిగేవి. కానీ, ఇప్పుడు ప్రైవేటు టు ప్రైవేట్ వ్యవహారంలో కూడా కుంభకోణాలు పుట్టుకొస్తున్నాయి. వాటి వేటికి పత్రసహిత ఆధారాలు ఉండవు. ప్రైవేటు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వాధినేతలు మౌకిక ఆదేశాలు ఇవ్వడం ఈ కుంభకోణాల్లో అసలు కోణం. రెండు ప్రైవేటు సంస్థల మధ్య ఒప్పందాలు, వ్యవహారాలలో సైతం ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంటోంది. ఇవన్నీ ఆఫ్ ది రికార్డు ఆదేశాలే. మౌకిక సూచనలే. రఫేల్ కూడా అలాంటి కుంభకోణమే అనిపిస్తోంది. సుప్రీం కోర్టు మోడీ సర్కారుకు క్లీన్ చిట్ ఇచ్చి ఉండవచ్చు. కానీ, ఈ కుంభకోణంలో సుప్రీం పరిధిలోని రాని అంశాలు చాలానే ఉన్నాయి...

ఇంతకీ అసలు రఫేల్ ఎలా పుట్టింది...? ఇదొక యుద్ధ విమానం. దేశ రక్షణ అవసరాల దృష్ట్యా కొన్ని అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు గత యూపీఏ ప్రభుత్వం నిర్ణయం చేసింది. దానికి అనుగుణంగా ప్రొసీజర్ పూర్తి చేసి, టెండర్ ప్రక్రియ ద్వారా ఫ్రాన్స్ దేశంలోని దసో సంస్థను దీని కోసం ఎంపిక చేసింది. మొత్తం 126 రఫేల్ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అందులో 18 విమానాలను నేరుగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మిగతా 108 విమానాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ లో తయారు చేసేలా చర్చలు జరిపింది. ఒప్పందం పూర్తి కాకముందే యూపీఏ ప్రభుత్వం దిగిపోయి మోడీ సారథ్యంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. 2015 ఏప్రిల్ లో మోడీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు 36 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి నేరుగా కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించినట్టు ప్రకటించారు. ఇక్కడే వివాదం మొదలైంది. దేశ రక్షణకు సంబంధించిన యుద్ధ విమానాల కొనుగోలు పై ప్రభుత్వ పరంగా జరగాల్సిన ప్రొసీజర్ ఏదీ నిర్వహించకుండా నేరుగా మోడీ 36 రఫేల్ విమానాలు కొనుగోలు చేయబోతున్నట్టు అదీ, విదేశీ గడ్డ పై ప్రకటించడంతో వివాదం మొదలైంది. దీనికి సంబంధించి డిఫెన్స్ కేబినెట్ లో చర్చ జరిగిన దాఖలాలు లేవు. పాత ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న ఆధారాలు లేవు. మోడీ ఫ్రాన్స్ గడ్డ పై నుంచి ఈ ప్రకటన చేసిన తర్వాతే గత ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు భారత రక్షణ శాఖ ప్రకటించడం గమనార్హం.

మోడీ చేసుకున్న కొత్త ఒప్పందం ప్రకారం 36 యుద్ధ విమానాల కొనుగోలులో ఆఫ్ సెట్ నిబంధన కింద ఫ్రాన్స్ కు చెందిన దసో సంస్థ ఒప్పందం విలువలో 50 శాతాన్ని భారత్ లో తిరిగి పెట్టుబడిగా పెట్టాలి. ఈ నిబంధనలో భాగంగానే అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ఇన్ ఫ్రాతో దసో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడే మోడీ సర్కారు రాజకీయ జోక్యం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆఫ్ సెట్ భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ ఇన్ ఫ్రాను ఎంచుకునే విషయంలో రాజకీయ పలుకుబడి ఉపయోగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ చేసిన వ్యాఖ్యలే దీనికి ఆధారం. భారత ప్రభుత్వం నుంచి వచ్చిన సూచన మేరకే రిలయన్స్ ను తాము ఎంచుకున్నట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఇప్పుడు రిలయన్స్ పోషించబోయే పాత్ర కోసం గత యూపీఏ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ను ఎంపిక చేసింది. మోడీ మాత్రం దానిని తోసిరాజని ఓ ప్రైవేటు సంస్థ, అదీ నిన్న మొన్న పుట్టుకొచ్చిన రిలయన్స్ డిఫెన్స్ ఇన్ ఫ్రా కోసం సిఫార్సు చేశారు. ఇక్కడే కుంభకోణం జరిగిందనడానికి సర్కమ్ స్టాన్షియల్ ఎవిడెన్స్ కనిపిస్తోంది. అంతే కాక...ఒక్కో రఫేల్ విమానం ధరను 670 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు. అలా 36 విమానాల కొనుగోలు కోసం 58 వేల కోట్లు చెల్లించబోతున్నారు. ఈ ధర గత ఒప్పందంతో పోల్చుకుంటే రెండు రెట్లు ఎక్కువ అన్నది మరో ఆరోపణ.

ఇదీ మొత్తంగా రఫేల్ స్టోరీ. సుప్రీం తాజా తీర్పుతో మోడీ సర్కారు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకుంది. కానీ, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

Click here for Video

Related Articles